Wednesday, September 9, 2020

India - big rally in chattisgarh,

avani news

పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌

పోలీసు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతేవాడలో వందలాది మంది ఆదివాసీలు పోలీసు క్యాంపు ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన తెలియచేసారు. మూడు జిల్లాల ఆదివాసీలు సాంప్రదాయ ఆయుధాలతో ప్రదర్శన నిర్వహించారు.
దంతేవాడలోని గుమియపాల్ పంచాయతీలోని అల్నార్ గ్రామం దగ్గర వున్న కొండ ప్రాంతంలో వున్న ఇనుప ఖనిజం గనిని ప్రభుత్వం ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పింది కాని నక్సలైట్ కార్యకలాపాల కారణంగా, ఆ సంస్థ తవ్వకాన్ని చేపట్టలేకపోయింది. మైనింగ్ జరిపే కంపెనీ భద్రత కోసం గుమియపాల్‌లో కొత్త పోలీసు క్యాంప్ ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు తమ నిరసన తెలియచేసారు. పోలీసు క్యాంపు పేరిట పోలీసులు తమ భూమిని స్వాధీనం చేసుకుంటారని, అల్నార్ ఇనుప ఖనిజం గనిని ప్రైవేట్ కంపెనీ గనుల తవ్వకానికి మార్గాన్ని సుగమం చేస్తారనీ గ్రామస్తులు అంటున్నారు.

బైలాదిల్లా ప్రాంత గ్రామస్తులు గనుల తవ్వకానికి, భూసేకరణకు వ్యతిరేకంగా కిరాండుల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని గుమియపాల్ గ్రామంలో వేలాది మంది గ్రామస్తులు సమావేశమయ్యారు. అసలు గ్రామసభకు బదులుగా, నకిలీ పద్ధతిలో గ్రామసభను నిర్వహించడం ద్వారా ప్రభుత్వం ఇనుప ఖనిజం త్రవ్వకాలతో పాటు ఇతర పనులను ప్రారంభింపచేస్తుందనీ, అలా జరగడానికి అనుమతించం అని గ్రామస్తులు అంటున్నారు. అల్నార్ గ్రామసభను కూడా హిరోలి లాగా రద్దు చేయాలి, ఆర్తి స్పంజ్ ఐరన్ కంపెనీకి ఇచ్చిన లీజును రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

తమకు రక్షణ కల్పించాల్సిన భద్రతా దళాలను పెద్ద పెద్ద కంపెనీలకోసం భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు, కాబట్టి ఈ ప్రాంతంలో ప్రతిపాదిత పోలీసు క్యాంపులను కూడా నిరసనలో పాల్గొన్న గ్రామస్తులు వ్యతిరేకించారు. పోలీసు క్యాంపులు వుంటే బతకడానికి భయమేస్తోంది అని వారన్నారు. వూళ్ళో స్కూళ్ళు, ఆశ్రమాలు ఆసుపత్రులు, రోడ్లు ఏర్పాటు చేయండి కానీ పోలీసు క్యాంపులు కాదు అని అంటున్నారు.
బస్తర్ అంతటా ఐ‌పి‌సి సెక్షన్ 244(1) 5వ అమలులో వున్నప్పటికీ గ్రామ సభ అనుమతి తీసుకోకుండానే గ్రామాల్లోని భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వం లీజుకిస్తోంది. ఇది ఆదివాసీల హక్కులపై జరుగుతున్న దాడి.
(gaonconnection.com సౌజన్యంతో)
Keywords : chattisgarh, police camp, mines, adivasi, rally, meeting
(2020-09-09 21:44:08)


No comments:

Post a Comment