ప్రజాపోరాటాల సాక్షిగా ఆ గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది - అరుణోదయ రామారావుకు అరుణారుణ జోహార్లు.
(విప్లవ రచయితల సంఘం పత్రికా ప్రకటన పూర్తి పాఠం)
నాలుగు దశాబ్దాలు పైబడిన పాటల ప్రవాహం ఇక విశ్రమించింది. రుణ గంభీర స్వరాల సాంస్కృతిక మూర్తిమత్వం ఇక అరుణకాంతుల అమరత్వంలో నిలిచిపోతుంది. అరుణోదయ రామారావు హఠాత్తుగా మనల్ని విడిచి వెళ్లిపోయారన్న విషాద వార్త తెలిసింది. కొద్దిరోజుల క్రితమే ఆ గొంతులో సుడితిరిగిన పాటల ఊపిరి ఆగిపోయిందని, ఆయన గుండె పోటుతో ఈ మధ్యాహ్నం మరణించారంటే నమ్మశక్యం కాలేదు. ఈ ఫిబ్రవరిలో నల్లగొండ విరసం సాహిత్యపాఠశాల వేదిక ఆయన పాటలతో హోరెత్తింది. వివి, సాయిబాబా సహా దేశవ్యాప్తంగా నిర్బంధించబడిన మేధావులకు సంఘీభావం తెలుపుతూ ఫాసిస్టు వ్యతిరేక ఉమ్మడి స్వరాల ఆవశ్యకతను చాటుతూ,
దెబ్బతిన్న ప్రజాపోరాటాలు మళ్లీ లేచినిలుస్తాయని ఆశాభావం ప్రకటించారు.
సంస్థ పేరునే ఇంటిపేరుగా ధరించిన రామారావు గారు 1955లో కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో జన్మించారు. మట్టినుండి సహజసిద్ధంగా పుట్టిన అద్భుతమైన కళ ఆయన సొంతం. చిన్నతనం నుండి భజన పాటలు, వీరబ్రహ్మం తత్వాలు, రంగస్థల పద్యాలు అలవోకగా ఆలపించే రామారావు కాలేజీ రోజుల్లో పాడిన పాటలకు సినీ గాయకుడు ఘంటసాల ముగ్ధుడయ్యాడని ఆయన ప్రోత్సాహంతో
సంగీతం నేర్చుకొని సినిమాలో పాడే అవకాశం వచ్చినప్పుడు, ఆ రోజుల్లో
ఉవ్వెత్తున ఎగసిన రైతుకూలీ పోరాటాలు తానుండవలసిన స్థానం ఏమిటో
దిశానిర్దేశం చేసాయని ఆయన చెప్పేవారు. కానూరి వెంకటేశ్వరరావు ప్రేరణతో
పూర్తికాలం ప్రజాకళాకారుడిగా మారి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య మొదటి కార్యదర్శిగా పల్లెపల్లెకూ తిరిగి లక్షలాది మందిని ఉత్తేజితుల్ని
చేసారాయన. ఎంతో మంది కళాకారుల్ని తయారుచేసారు. ప్రజా క్షేత్రంలో, విప్లవ ప్రజాసంఘాల వేదికల్లో వేలాది సాంస్కృతిక ప్రదర్శనలిచ్చిన రామారావు గారు అమూల్యమైన ప్రజాఉద్యమ కళాసంపదను అందించారు. సాహిత్యం, కళలు నిరంతరం ప్రతిపక్షం, ప్రజాపక్షం వహించాలని, రాజ్యాన్ని ధిక్కరించాలని, ప్రజాపోరాటాల వెంట నడవాలని చాటి చెప్పిన అరుణోదయ రామారావు స్ఫూర్తి అజరామరం. విప్లవ రచయితల సంఘం ఆయనకు వినమ్రంగా నివాళులర్పిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సంతాపం తెలియజేస్తున్నది.
కామ్రేడ్ అరుణోదయ రామారావుకు అరుణారుణ జోహార్లు.
ప్రజాకళలు, ప్రజాసంస్కృతి వర్ధిల్లాలి.
-పాణి (కార్యదర్శి)
No comments:
Post a Comment