రాజస్థాన్‌లోని అల్వర్ జిల్లాలో ఏప్రిల్ 26న ఓ దళిత ʹజంట మోటార్
సైకిల్‌పై వెళ్తుండగా ఆ దంపతులను ఐదుగురు వ్యక్తులు అటకాయించారు. నిర్జన
ప్రదేశానికి తీసుకువెళ్లారు. భర్త సమక్షంలోనే భార్యపై అత్యాచారానికి
పాల్పడ్డారు. భర్తను విచక్షణా రహితంగా కొట్టారు. మహిళను అత్యాచారం చేస్తూ
మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. పోలీసులకు కంప్లైంట్ చేస్తే వీడియోను
బయటపెడతామని నిందితులు హెచ్చరించారు. ఆ దుర్మార్గులు డబ్బుల కోసమూ
బెదిరించారు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోను బైట్ అపెడతామని హిచ్చరించారు.
చివరికి వీడియోను బయటపెట్టారు.
ఈ దేశం దళితులకేమిచ్చింది ?
వాళ్ళకు భయపడ్డ ఆ దంపతులు కొన్ని రోజులు మౌనం వహించారు. అయినా ఈ దంపతులపై ఆ దుర్మార్గుల ఆగడాలు ఆగలేదు చివరకు ఆ దంపతులు ధైర్యం తెచ్చుకొని మే2న పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కేసు నమోదు చేసుకున్నా, ఎవరినీ అరెస్టు చేయలేదు. ఎన్నికలు జరుగుతున్నాయనే సాకు చూపించారు.
ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ థానాగాజీ పట్టణంలో దళిత సంఘాలు మంగళవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. స్థానికంగా ఉన్న జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నాయి. అనేక చోట్ల దళిత సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. సోషల్ మీడియాలో ఆ దంపతులకు మద్దతుగా పోస్ట్ లు వెల్లువెత్తాయి. అప్పటికిగానీ పోలీసులు కదలలేదు. చివరకు ఆ దుర్మార్గుల్లో ఒకణ్ణి అరెస్టు చేశారు.
ఈ సంఘటన పై ప్రతిపక్ష బీజేపీ కూడా స్పంధించి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. చివరకు రాజస్థాన్ డీజీపీ కపిల్ గార్గ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అత్యాచార ఘటనలో ఐదుగురు పాల్గొన్నారని, నిందితులను వెతికిపట్టుకునేందుకు 14 పోలీసు బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు.
రాజస్తాన్ లో దళిత మహిళపై అత్యాచారం జరిగిన రోజే (ఏప్రెల్ 26) ఉత్తరాఖండ్‌లోని టెహరీలోని శ్రీకోట్ లో జరిగిన ఒక పెళ్ళి విందుకు జితేంద్ర అనే దళిత యువకుడు హాజరయ్యాడు. తమతోపాటు భోజనం చేస్తున్న జితేంద్రపై కొంతమంది అగ్రవర్ణ దురహంకారులు దాడిచేశారు. తమ ఎదురుగా కూర్చొని భోజనం చేస్తావా అని చావ చితక్కొట్టారు. డెహ్రాడూన్‌లోని ఒక ఆస్పత్రిలో గత 9 రోజులుగా చికిత్స పొందుతూ జితేంద్ర మరణించాడని టెహరీ డీఎస్పీ ఉత్తమ్‌సింగ్ చెప్పారు. జితేంద్ర సోదరి ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
మే1వతేదీన మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా పార్నర్ తాలుకా నిఘోజ్ గ్రామంలో మరో దుర్మార్గం జరిగింది. రుక్మిణి అనే అగ్రకులానికి చెందిన యువతి దళితుడైన మంగేష్ ప్రేమించుకొని ఆరు నెలల క్రితం పెళ్ళి చేసుకున్నారు. ఆ పెళ్ళిని వ్యతిరేకించిన రుక్మిణి కుటుంభం పెళ్ళి అయిన రోజు నుండి వీరిని అనేక రకాలుగా బెధిరించారు. అయినా ఈ యువజంట భయపడకుండా ధైర్యంగా జీవిస్తున్నారు. భార్యా భర్తల మధ్య చిన్న గొడవ జరగడంతో రుక్మిణి పుట్టింటికి వెళ్ళింది. ఆమెను తీసుకరావడానికి మంగేష్ కూడా వెళ్ళాడు. మంగేష్ ను అడ్డుకున్న రుక్మిణి తండ్రి రామ భారతీయ, చిన్నాన్నలు సురేంద్ర భారతీయ, ఘన్ శ్యాం భారతీయలు ఆయనపై దాడి చేశారు అడ్డు వచ్చిన రుక్మిణిపై కూడా దాడి చేశారు. ఒకవైపు దాడి చేస్తూనే పెట్రోల్ తీసుకొచ్చి ఇద్దరిపై పోసి నిప్పంటించారు. యువజంట హాహాకారాలు చేస్తున్నా వాళ్ళను వదలలేదు రూంలోకి తోసి తలుపులు వేసేశారు. వారి అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్ళు పరుగున వచ్చి వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం నాడు రుక్మిణి కన్ను మూసింది. మంగేష్ ఇంకా ఆస్పత్రిలో మరణంతో పోరాడుతున్నాడు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రుక్మిణి చిన్నాన్నలు సురేంద్ర భారతీయ, ఘన్ శ్యాం భారతీయలను అరెస్టు చేశారు రుక్మిణి తండ్రి రామ భారతీయ పరారీలో ఉన్నాడని పర్మార్ తాలూకా సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ భాత్రే మీడియాకు తెలిపారు.
దళితులపై అత్యాచారాలు, హత్యలు, దాడులు ఈ దేశంలో కొత్త కాదు.ఈ మూడు సంఘటనలు మొదటివి కావు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మూలంగా, దళితులు, ప్రజాస్వామిక వాదులు చేసిన అనేక పోరాటాల మూలంగా రాజ్యాంగం దళితులకు కొంత రక్షణ కల్పించినప్పటికీ ఆచరణలో ఆ రక్షణలు ఎందుకూ పనికిరావడం లేదు. దళితులపై దాడులు చేస్తున్న అగ్రవాదులకే పాలకుల మద్దతు లభిస్తోంది.
ఈ దేశంలోని వ్యవస్థలన్నీ అగ్రకులాల చెప్పుచేతల్లో ఉండటం వల్ల ఏ వ్యవస్థ కూడా దళితులకు న్యాయం చేయడంలేదు. చుండూరులో దళితులపై హత్యాకాండకు పాల్పడ్డ వాళ్ళంతా నిర్దోషులుగా బయటపడటం ఇందుకు మంచి ఉదహరణ.
మరీ దూరం పోకుండా మనకు తెలిసిన కిల్వెన్మణి దళితుల హత్యాకాండ మొదలుకుంటే ఇప్పటిదాకా మూకుమ్మడిగా దళితులను నరికి చంపిన ఘట్నల్లో, దళిత మహిళపై అత్యాచారం చేసిన , హత్య చేసిన ఘటనల్లో, గొడ్డు మాంసం తిన్నారన్న పేరుతో హత్యలు, దాడులు...ప్రతి రోజూ ఈ దేశం ఏదో ఓ మూలల్లో దళితులపై జరుగుతున్నదుర్మార్గాలు...ఏ ఘటనలో కూడా బాధితులకు న్యాయం జరగలేదు. లేదా పూర్తి న్యాయం జరగలేదు. పైగా అనేక చోట్ల బాధితులనే దోషులగా చేసింది సమాజం.
పైగా మతకలహాలు జరిగినప్పుడు అగ్రకులాలు దళితులనే రెచ్చగొట్టి తమ సైన్యంగా ఉపయోగించుకోవడం కూడా మనం గుజరాత్ మారణహోమంలో చూశాం. మైనార్టీలమీద దాడులకోసం దళితులూ హిందువులే అని చెప్పే మతోన్మాదులు ఏనాడూ దళితులను తమతో సమానమైన వ్యక్తులుగా చూడలేదు.
అంబేడ్కర్ ఏనాడో చెప్పినప్పటికీ తమకు అసలైన శత్రువులెవరో ఇపుడిప్పుడే అర్దం చేసుకుంటోంది దళిత సమాజం. అయితే ఓ సంఘటన జరిగినప్పుడు ఓ ధర్నా..ఓ ర్యాలీ...మరో ఆందోళన....ఇవి జరగాల్సిందే కానీ ఇవే సమస్యకు పరిష్కారంకాదు. అంతేకాదు ఎవరో నలుగురు దళిత నాయకులు ఎన్నికల్లో గెల్చి అధికారంలోకి వచ్చినా ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఈ దేశ పాలక వర్గాలుగా అగ్రకుల, దోపిడి వర్గాలున్నంత కాలం దళితులు ప్రధానులైనా ముఖ్యమంత్రులైనా దళితులపరిస్థితి మారదు. దళితులు గ్రామ స్థాయి నుండి ఢిల్లీ దాకా రాజ్యాధికారంలోకి రావాలి. దానికోసం దళితులు ఒంటరిగా కాకుండా.. ఈ దేశంలో అణిచివేతకు, దోపిడికి గురవుతున్న మత మైనార్టీలను, ఆదివాసులను, మహిళలను, ఇతర బలహీనవర్గాలను, కలిసి వచ్చే అన్ని వర్గాలను, శక్తులను కలుపుకొని మహత్తరపోరాటానికి సిద్దం కావాలి. లేదా అట్లా జరుగుతున్న పోరాటాలతో చేతులు కలపాలి.
- ఎస్.నిర్మల
Keywords : rajastan, dalit women, rape, upper cast,
No comments:
Post a Comment